2 కొరింతీ పత్రిక 11
11
దైవికమైన రోషం
1నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు. 2మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే, 3సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
4ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.
5ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను. 6ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో దీన్ని మీకు తెలియజేసాం. 7మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా?
8మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.” 9నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
10క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 11ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు. 12అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.
కపట బోధకుల గురించి హెచ్చరిక
13అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.
పౌలు ఆధిక్యతలు
16మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్ధిహీనుడిగానే చేర్చుకోండి. 17గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్ధిహీనుడిలా చెబుతున్నాను. 18చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను. 19తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు. 20ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు. 21వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే-బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను-నేనూ అతిశయిస్తాను.
22వారు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా.
23వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. 24యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను. 25మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.
26తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో అపాయాలూ దోపిడీ దొంగల వలన అపాయాలూ నా సొంత ప్రజల వలన అపాయాలూ యూదేతరుల వలన అపాయాలూ పట్టణాల్లో అపాయాలూ అరణ్యాల్లో అపాయాలూ సముద్రంలో అపాయాలూ కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి. 27కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను.
28ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది. 29మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?
30అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను. 31ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు. 32దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు. 33అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.
Селектирано:
2 కొరింతీ పత్రిక 11: IRVTel
Нагласи
Копирај
Спореди
Сподели
Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.