యోహాను 14
14
పస్కా భోజనగదిలో మాటలు: తన వారికోసం వస్తానని యేసు అభయం
1తెస్స 4:14-17
1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు. 5తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు. 6యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.
యేసూ, తండ్రీ ఒక్కటే
7 మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. 8ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. 9యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు? 10నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు. 11తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.
12 నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.
ప్రార్థన గురించిన కొత్త వాగ్దానం
13 “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. 14మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. 15మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.
ఆత్మను గురించిన వాగ్దానం
16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను. 19కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. 20నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.
21 నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు. 22యూదా (ఇస్కరియోతు కాక వేరొక యూదా) యేసుతో, “ప్రభూ, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?” అన్నాడు. 23యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.
24 నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. 25మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను. 26నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.
శాంతి ప్రదాత యేసు
27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. 28‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు. 29ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.
30 ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు. 31నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.”
S'ha seleccionat:
యోహాను 14: IRVTel
Subratllat
Copia
Compara
Comparteix
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.