ఆదికాండము 2

2
1ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. 2దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవదినమున విశ్రమించెను. 3కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
4దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే. 5అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు; 6అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను. 7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. 8దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. 9మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. 10మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను. 11మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. 12ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును. 13రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది. 14మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు#2:14 ఫరాతు. 15మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. 16మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
18మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. 19దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. 20అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. 21అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. 22తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. 23అప్పుడు ఆదాము ఇట్లనెను –
నా యెముకలలో ఒక యెముక
నా మాంసములో మాంసము
ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
25అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录

YouVersion 使用 cookie 来个性化你的体验。使用我们的网站,即表示你同意我们根据我们的隐私政策来使用 cookie。