మత్తయి సువార్త 12

12
యేసు సబ్బాతు దినానికి ప్రభువు
1ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులకు ఆకలివేసి కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు. 2అది చూసిన పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
3అందుకు ఆయన వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? 4అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తనతో ఉన్నవారు తిన్నారు కదా! 5యాజకులు సబ్బాతు దినాన దేవాలయం విధులను నిర్వహించడం కూడా సబ్బాతు దినాన్ని అపవిత్ర పరచినట్లే అయినాసరే వారు నిర్దోషులని ధర్మశాస్త్రంలో చదవలేదా? 6దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్తున్నాను. 7‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’#12:7 హోషేయ 6:6 అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు. 8ఎందుకంటే మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
9ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు. 10అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న కొందరు, “సబ్బాతు దినాన బాగుచేయడం ధర్మశాస్త్రానుసారమా?” అని అడిగారు.
11అందుకు యేసు వారితో, “మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది సబ్బాతు దినాన గుంటలో పడితే దానిని పట్టుకుని బయటకు తీయకుండా ఉంటారా? 12గొర్రె కంటే మనిషి విలువ ఎంతో ఎక్కువ కదా! కాబట్టి సబ్బాతు దినాన మంచి చేయడం ధర్మశాస్త్ర ప్రకారం న్యాయమే” అన్నారు.
13ఆయన ఆ వ్యక్తితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే అది రెండవ చేయిలా పూర్తిగా బాగయింది. 14కానీ పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపుదామా అని ఆయన మీద పన్నాగం పన్నారు.
దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు
15యేసు ఆ సంగతిని తెలుసుకొని అక్కడినుండి వెళ్లిపోయారు. చాలా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన రోగులందరిని బాగుచేశారు. 16ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు. 17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే:
18“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు,
నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను;
ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను.
ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
19ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు;
వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు.
20న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు
ఆయన నలిగిన రెల్లును విరువడు,
మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు.
21దేశాలు ఈయన నామంలో నిరీక్షణ కలిగి ఉంటాయి.”#12:21 యెషయా 42:1-4
యేసు బయెల్జెబూలు
22అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవానిగా ఉండిన ఒకనిని కొందరు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, వాడు చూడగలుగునట్లు మాట్లాడగలుగునట్లు యేసు వానిని బాగుచేశారు. 23కాబట్టి ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు.
24కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు, “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
25యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు. 26ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? 27ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు. 28కానీ ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.
29“ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.
30“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. 31అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను. 32మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు.
33“చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. 34సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది. 35మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. 36కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కోసం తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే. 37ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”
యోనా యొక్క సూచకక్రియ
38అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు.
39అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు. 40ఎలాగైతే యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడు. 41నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.” 42దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది.
43“అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు. 44అప్పుడది, ‘నేను వదిలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరు లేకపోవడం, పైగా శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది. 45అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది. ఈ దుష్టతరం కూడా అలాగే ఉంటుంది” అని చెప్పారు.
యేసు తల్లి తమ్ముళ్ళు
46యేసు ఆ జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు. 47అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.
48అందుకు యేసు అతనికి, “నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?” అని చెప్పి 49తన శిష్యులను చూపిస్తూ, “వీరే నా తల్లి, నా సహోదరులు. 50ఎందుకంటే నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి” అని జవాబిచ్చారు.

Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:

మత్తయి సువార్త 12: TSA

Ìsàmì-sí

Pín

Daako

None

Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀

Àwọn fídíò fún మత్తయి సువార్త 12