ఆదికాండము 1

1
ప్రపంచ ప్రారంభం
1మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. 2భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.
మొదటి రోజు-వెలుగు
3అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. 4దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. 5వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు.
అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.
రెండవ రోజు-ఆకాశం
6అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం#1:6 అంతరిక్షం హెబ్రీ భాషలో “అంతరిక్షం” కు బదులు “గాలి” అని ఉన్నది. ఉండును గాక!” అన్నాడు. 7కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందను ఉంది. 8దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు.
మూడవ రోజు-పొడి నేల, మొక్కలు
9అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది. 10ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. 11అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించును గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది. 12గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
13అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు.
నాలుగవ రోజు-సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
14అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల#1:14 ప్రత్యేక సమావేశాలు ఇశ్రాయేలీయులు సూర్యచంద్రులను ఆధారం చేసుకొని నెలలను, సంవత్సరాలను నిర్ణయించేవారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అనేక యూదుల శెలవులు, ప్రత్యేక సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి. 15భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అని దేవుడు అన్నాడు. అలాగే జరిగింది.
16కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. 17భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. 18పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
19అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.
అయిదవ రోజు-చేపలు, పక్షులు
20అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అని దేవుడు అన్నాడు. 21కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేశాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేశాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
22ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు.
23అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు.
ఆరవ రోజు-భూజంతువులు, మనుష్యులు
24అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు, చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయునుగాక” అని దేవుడు అన్నాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.
25కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేశాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
26అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలోని పక్షులన్నింటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు.
27కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు. 28దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు.
29“ఆహార ధాన్యపు మొక్కలన్నింటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది. 30మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.
31దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.
అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.

Vurgu

Paylaş

Kopyala

None

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın

YouVersion, deneyiminizi kişiselleştirmek için tanımlama bilgileri kullanır. Web sitemizi kullanarak, Gizlilik Politikamızda açıklandığı şekilde çerez kullanımımızı kabul etmiş olursunuz