రోమా 9:19-33 - Compare All Versions

రోమా 9:19-33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛ యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? ఆప్రకారము– నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు రాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులనివారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పినప్రకారము– సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు, వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. –ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

షేర్ చేయి
రోమా 9 TELUBSI

రోమా 9:19-33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా? ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి? దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.” “ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు. యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.” అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు. “ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

షేర్ చేయి
రోమా 9 IRVTEL

రోమా 9:19-33 TERV (పవిత్ర బైబిల్)

మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా? భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని పిలుస్తాను. నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను.” “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.” యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా, కొందరు మాత్రమే రక్షింపబడతారు. ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.” యెషయా జరుగుతుందని చెప్పినట్లు: “సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని మనకు వదిలి ఉండక పోయినట్లైతే మనం సొదొమ ప్రజలవలే, గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.” మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులుకాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది. కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు. ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది

షేర్ చేయి
రోమా 9 TERV

రోమా 9:19-33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు, కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?” ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా? దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, “నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను; నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,” ఇంకా, “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అదే స్థలంలో వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.” ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు. ప్రభువు తాను చెప్పిన మాటను భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.” యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.” అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు. కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు. దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది: “ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని, వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను, ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”

షేర్ చేయి
రోమా 9 TSA