రోమా పత్రిక 9:19-33

రోమా పత్రిక 9:19-33 IRVTEL

అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా? ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి? దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.” “ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు. యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.” అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు. “ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

రోమా పత్రిక 9:19-33 కోసం వీడియో