రోమా 9:19-33
రోమా 9:19-33 TELUBSI
అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛ యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? ఆప్రకారము– నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు రాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులనివారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పినప్రకారము– సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు, వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. –ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

