యిర్మీయా 32:1-16
యిర్మీయా 32:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో పదవ సంవత్సరంలో అంటే నెబుకద్నెజరు ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరంలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది. బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు. యూదా రాజైన సిద్కియా అతన్ని అక్కడ బంధించి, “నీవు అలా ఎందుకు ప్రవచిస్తున్నావు? పైగా నీవంటున్నావు, ‘యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. యూదా రాజైన సిద్కియా బబులోనీయుల నుండి తప్పించుకోడు, అతడు బబులోను రాజు చేతికి ఖచ్చితంగా అప్పగించబడతాడు, సిద్కియా అతనితో ముఖాముఖి మాట్లాడతాడు తన కళ్లారా అతన్ని చూస్తాడు. అతడు సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని సంగతి చూసే వరకు అతడు అక్కడే ఉంటాడని యెహోవా ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు బబులోనీయులతో పోరాడితే విజయం సాధించలేరు’ అని చెప్పావు” అన్నాడు. యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్కు నాకు వచ్చింది: నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు. “అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు; కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ వెండి తూకం వేసి ఇచ్చాను. నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను. అప్పుడు కొనుగోలు నియమ నిబంధనలు వ్రాసి ముద్ర వేసిన, ముద్ర వేయని పత్రాలను నేను తీసుకున్నాను. నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను. “వారి సమక్షంలో నేను బారూకుకు ఈ సూచనలను ఇచ్చాను: ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ పత్రాలను, అనగా ముద్ర వేసిన కొనుగోలు పత్రాన్ని, ముద్ర వేయని కొనుగోలు పత్రాన్ని తీసుకుని, అవి చాలా కాలం పాటు ఉండేలా వాటిని మట్టికుండలో దాచిపెట్టు. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ దేశంలో మళ్ళీ ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’ “నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను
యిర్మీయా 32:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదా రాజైన సిద్కియా పాలన పదో సంవత్సరంలో, అంటే, నెబుకద్నెజరు ఏలుబడి 18 వ సంవత్సరంలో యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలంలో బబులోను రాజు సైన్యం యెరూషలేముకు ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యూదా రాజు గృహ ప్రాంగణంలో ఖైదీగా ఉన్నాడు. యూదా రాజైన సిద్కియా అతణ్ణి బంధించి, అతనితో మాట్లాడుతూ “నువ్వు ఇలా ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “యెహోవా ఇలా అంటున్నాడు, ‘చూడు, ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు, యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పటికే అతణ్ణి బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. అతని నోరు రాజు నోటితో మాట్లాడుతుంది. అతని కళ్ళు రాజు కళ్ళను చూస్తాయి. సిద్కియా బబులోను వెళ్లి నేను అతని పట్ల ఏదో ఒకటి జరిగించే వరకు అక్కడే ఉంటాడు. మీరు కల్దీయులతో యుద్ధం చేశారు కాబట్టి మీరు జయం పొందరు.’” ఇది యెహోవా వాక్కు. యిర్మీయా ఇలా అన్నాడు. “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, చూడు, మీ బాబాయి షల్లూము కొడుకు హనమేలు నీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ‘అనాతోతులో ఉన్న నా భూమిని కొనుక్కో. ఎందుకంటే దాన్ని కొనుక్కునే హక్కు నీకే ఉంటుంది.’” అప్పుడు, యెహోవా ప్రకటించినట్టే, మా బాబాయి కొడుకు హనమేలు చెరసాల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి, నాతో ఇలా అన్నాడు. “బెన్యామీను దేశంలో అనాతోతులో ఉన్న నా భూమిని నీ కోసం కొనుక్కో. ఎందుకంటే దాని మీద వారసత్వపు హక్కు నీదే.” అప్పుడు ఇది యెహోవా వాక్కు అని నాకు తెలిసింది. కాబట్టి, మా బాబాయి కొడుకు హనమేలు పొలం కొని, 17 తులాల వెండి తూచి అతనికిచ్చాను. అప్పుడు నేను దాన్ని తోలు చుట్ట మీద రాసి ముద్ర వేసి సాక్షుల సంతకాలు పెట్టించుకున్నాను. ఆ తరువాత వెండిని తూచి ఇచ్చాను. ఆ తరువాత ఆజ్ఞల, చట్టాల ప్రకారం ముద్ర ఉన్న, ముద్ర లేని దస్తావేజులను తీసుకున్నాను. అప్పుడు మా బాబాయి కొడుకు హనమేలు ఎదుట, ఆ రాత పత్రంలో రాసిన సాక్షుల ఎదుట, చెరసాల ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి ఎదుట, నేను మహసేయా కొడుకైన నేరీయా కొడుకు బారూకుకు ఆ దస్తావేజులు అప్పగించి, వాళ్ళ కళ్ళ ఎదుట బారూకుకు ఇలా ఆజ్ఞాపించాను, “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘కొనుగోలు రసీదుతో పాటు ఈ రాత ప్రతులు, అంటే, ముద్ర వేసిన రాత పత్రం, ముద్ర లేని రాత పత్రం తీసుకుని, అవి చాలా కాలం ఉండేలా వాటిని కొత్త కుండలో ఉంచు.’ ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు మళ్ళీ ఈ దేశంలో కొనడం జరుగుతుంది.’” నేరీయా కొడుకు బారూకు చేతికి ఆ రసీదును నేను అప్పగించిన తరువాత, నేను యెహోవాకు ప్రార్థన చేసి ఇలా అన్నాను
యిర్మీయా 32:1-16 పవిత్ర బైబిల్ (TERV)
యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు. కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు. బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’”) యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు. “తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’” అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచాను. మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసుకున్నాను. తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యెదుట నేనా దస్తావేజులను బారూకునకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు. ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను: “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’ ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’” నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను
యిర్మీయా 32:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ . సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును, యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును, అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు; మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. అంతట యిర్మీయా ఇట్లనెను–యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి – అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి–బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమునుకొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా –ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును. నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని