యిర్మీయా 32:1-16
యిర్మీయా 32:1-16 TERV
యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు. కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు. బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’”) యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు. “తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’” అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచాను. మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసుకున్నాను. తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యెదుట నేనా దస్తావేజులను బారూకునకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు. ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను: “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’ ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’” నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను

