యిర్మీయా 32:1-16

యిర్మీయా 32:1-16 TELUBSI

యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ . సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును, యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును, అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు; మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. అంతట యిర్మీయా ఇట్లనెను–యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి – అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి–బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమునుకొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా –ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును. నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని