ఆదికాండము 27:19-29
ఆదికాండము 27:19-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు. ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు. యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు. అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు. యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు. “నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు. “అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు. అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు. యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు. అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు. కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు, “ఆహా, నా కుమారుని వాసన యెహోవా దీవించిన పొలం యొక్క సువాసన దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక. జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”
ఆదికాండము 27:19-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు. అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో “నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అన్నాడు. దానికి యాకోబు “నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది” అన్నాడు. అప్పుడు ఇస్సాకు “నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా” అన్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. “స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే” అన్నాడు. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు. “నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు. అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు. అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. “చూడు, నా కొడుకు సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక! మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”
ఆదికాండము 27:19-29 పవిత్ర బైబిల్ (TERV)
“నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేశాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటితో నీకొరకైన భోజనమును సిద్ధపరచాను. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు. అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు. “త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేశాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు. అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబుతో. కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు. యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అని ఇస్సాకు అడిగాడు. “అవును, నేనే” అని యాకోబు జవాబిచ్చాడు. అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను దానిని తిని, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేశాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు. అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు. కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలా ఉంది. విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్లు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక. మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు
ఆదికాండము 27:19-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యాకోబు–నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు–నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు–నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తనతండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి–స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి –ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు–నేనే అనెను. అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రియైన ఇస్సాకు –నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక