ఆది 27:19-29

ఆది 27:19-29 IRVTEL

దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు. అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో “నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అన్నాడు. దానికి యాకోబు “నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది” అన్నాడు. అప్పుడు ఇస్సాకు “నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా” అన్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. “స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే” అన్నాడు. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు. “నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు. అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు. అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. “చూడు, నా కొడుకు సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక! మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”

ఆది 27:19-29 కోసం వీడియో