ఆది 27:19-29
ఆది 27:19-29 TSA
యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు. ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు. యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు. అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు. యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు. “నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు. “అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు. అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు. యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు. అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు. కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు, “ఆహా, నా కుమారుని వాసన యెహోవా దీవించిన పొలం యొక్క సువాసన దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక. జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”

