నిర్గమకాండము 16:14-26

నిర్గమకాండము 16:14-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత పోగుచేసుకోవాలి. మీ గుడారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు చొప్పున పోగుచేసుకోవాలి.’ ” ఇశ్రాయేలీయులు తమకు చెప్పబడినట్లుగానే చేశారు; కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు. వారు దానిని ఓమెరుతో కొలిచినప్పుడు ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు. ప్రతిఒక్కరు తమకు ఎంత అవసరమో అంతే పోగుచేసుకున్నారు. అప్పుడు మోషే వారితో, “దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకోకూడదు” అని చెప్పాడు. అయితే వారిలో కొందరు మోషే మాట వినిపించుకోకుండా దానిలో కొంచెం ఉదయం వరకు మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టింది. కాబట్టి మోషే వారిమీద కోపడ్డాడు. ప్రతి ఉదయం ప్రతి ఒక్కరు తమకు కావలసినంత పోగుచేసుకునేవారు, ఎండ తీవ్రత పెరిగినప్పుడు అది కరిగిపోయేది. ఆరవరోజు, ఒక్కొక్కరికి రెండేసి ఓమెర్ల చొప్పున రెట్టింపు పోగుచేసుకున్నారు, సమాజ నాయకులు వచ్చి మోషేకు దానిని తెలిపారు. అతడు వారితో, “యెహోవా ఆజ్ఞ ఇదే, రేపు సబ్బాతు దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన సబ్బాతు విశ్రాంతి దినము. కాబట్టి మీరు కాల్చుకోవాలనుకున్నది కాల్చుకోండి, వండుకోవాలనుకున్నది వండుకోండి. మిగిలింది ఉదయం వరకు ఉంచుకోండి” అని చెప్పాడు. మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఉదయం వరకు దానిని ఉంచారు కాని అది కంపుకొట్టలేదు పురుగులు పట్టలేదు. అప్పుడు మోషే, “ఈ రోజు దానిని తినండి. ఈ రోజు యెహోవాకు సబ్బాతు దినము. ఈ రోజు నేల మీద ఏమి దొరకదు. ఆరు రోజులు మీరు దానిని పోగుచేసుకోవాలి కాని ఏడవ రోజున, అనగా సబ్బాతు దినాన్న అది దొరకదు” అని చెప్పాడు.

నిర్గమకాండము 16:14-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.” ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు. అప్పుడు మోషే “ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు” అని వాళ్ళతో చెప్పాడు. అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది. ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు. అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.” మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు. అప్పడు మోషే “ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు. మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు” అని చెప్పాడు.

నిర్గమకాండము 16:14-26 పవిత్ర బైబిల్ (TERV)

సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.” కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు. ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు. “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు. కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది. ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది. శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు. “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో. కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు. శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”

నిర్గమకాండము 16:14-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను. ఇశ్రాయేలీయులు అట్లుచేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమతమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. మరియు మోషే–దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయమువరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపెట్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఆరవదినమునవారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించి నట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు. ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవదినమున అది దొరకదనెను.