నిర్గమ 16:14-26

నిర్గమ 16:14-26 IRVTEL

నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.” ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు. అప్పుడు మోషే “ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు” అని వాళ్ళతో చెప్పాడు. అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది. ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు. అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.” మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు. అప్పడు మోషే “ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు. మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు” అని చెప్పాడు.

నిర్గమ 16:14-26 కోసం వీడియో