నిర్గమకాండము 16:14-26
నిర్గమకాండము 16:14-26 TERV
సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.” కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు. ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు. “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు. కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది. ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది. శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు. “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో. కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు. శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”

