సామెతలు 24:1-18

సామెతలు 24:1-18 TSA

చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు; వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి, వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది. తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి. జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది. మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు. కీడు చేయాలని చూసే వ్యక్తి కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు. మూర్ఖుల పథకాలు పాపం, ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు. ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది! చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు; మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు. “కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా? నా కుమారుడా, తేనె తిను, అది మంచిది; తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది. జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో: అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది, నీ నిరీక్షణ తొలిగిపోదు. నీతిమంతుల నివాసం దగ్గర దొంగలా పొంచి ఉండవద్దు, వారి నివాస స్థలాన్ని దోచుకోవద్దు; ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు, కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు. నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు; వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు, లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో.