సామెతలు 24:1-18
సామెతలు 24:1-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు; వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి, వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది. తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి. జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది. మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు. కీడు చేయాలని చూసే వ్యక్తి కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు. మూర్ఖుల పథకాలు పాపం, ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు. ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది! చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు; మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు. “కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా? నా కుమారుడా, తేనె తిను, అది మంచిది; తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది. జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో: అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది, నీ నిరీక్షణ తొలిగిపోదు. నీతిమంతుల నివాసం దగ్గర దొంగలా పొంచి ఉండవద్దు, వారి నివాస స్థలాన్ని దోచుకోవద్దు; ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు, కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు. నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు; వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు, లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో.
సామెతలు 24:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు. వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది. జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది. తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి. జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి. వివేకం గల నాయకుడివై యుద్ధం చెయ్యి. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండడం భద్రత. మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు. కీడు చేయాలని పన్నాగాలు పన్నే వాడికి జిత్తులమారి అని పేరు పెడతారు. మూర్ఖుని ఆలోచన పాప భూయిష్టం. అపహాసకులను మనుషులు చీదరించుకుంటారు. కష్ట కాలంలో నీవు కుంగిపోతే చేతగాని వాడివౌతావు. మృత్యు ముఖంలో ఉన్న వారిని తప్పించు. నాశనం వైపుకు తూలుతున్న వారిని చేతనైతే రక్షించు. “చూసావా ఈ సంగతి మనకి తెలియ లేదు” అని నీవంటే సరిపోతుందా? హృదయాలను పరిశోధించేవాడు నీవు చెబుతున్నది గ్రహించడా? నీ జీవాన్ని కాపాడే వాడు నీ మాటను గ్రహించడా? మనుషులకు వారి చర్యలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా. నీ ఆత్మకు జ్ఞానం అలాటిదని తెలుసుకో. అది నీకు దొరికితే నీకు మంచి భవిషత్తు ఉంటుంది. నీకు ఆశాభంగం కలగదు. మంచివారి ఇళ్ళ దగ్గర పొంచి ఉండి దాడి చేసే దురాత్ముల్లాగా ఉండకు. వారి గృహాలను పాడు చేయకు. ఉత్తముడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. విపత్తు కలిగినప్పుడు భక్తిహీనులు కూలి పోతారు. నీ శత్రువు పడిపొతే సంతోషించవద్దు. వాడు తూలిపడినప్పుడు నీవు మనస్సులో అనందించవద్దు. యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో.
సామెతలు 24:1-18 పవిత్ర బైబిల్ (TERV)
దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు. కీడు చేయాలని వారు వారి హృదయాల్లో పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం కలిగించాలని మాత్రమే. మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి. జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింపబడతాయి. జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి. బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు. నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు. కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే. మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి. “ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు. నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు. మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేక వాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండవద్దు. ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు. నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు. నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు.
సామెతలు 24:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించునువారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును. జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు. కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము. నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లిసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.