మత్తయి సువార్త 10:16-22
మత్తయి సువార్త 10:16-22 TSA
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి. మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు. అయితే వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది; ఎందుకంటే, ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు. “సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.




