మత్తయి 10:16-22
మత్తయి 10:16-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి. మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు. అయితే వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది; ఎందుకంటే, ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు. “సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.
మత్తయి 10:16-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు. వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.
మత్తయి 10:16-22 పవిత్ర బైబిల్ (TERV)
“తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు. వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు. ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు.
మత్తయి 10:16-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు, – ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షింపబడును.


