లూకా సువార్త 4:3-13

లూకా సువార్త 4:3-13 TSA

అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు. అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు; నీ పాదాలకు ఒక రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’ ” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది” అని అన్నారు. అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.