లూకా 4:3-13
లూకా 4:3-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు. అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు; నీ పాదాలకు ఒక రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’ ” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది” అని అన్నారు. అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.
లూకా 4:3-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు. యేసు, “‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు. “ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు. అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు. ‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు. అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
లూకా 4:3-13 పవిత్ర బైబిల్ (TERV)
సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు. యేసు, “‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు. యేసు, “‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి, ఆయన సేవ మాత్రమే చెయ్యి’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు. ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’ అంతేకాక: ‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’ అని వ్రాయబడింది” అని అన్నాడు. యేసు, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’ అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.
లూకా 4:3-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అపవాది–నీవు దేవుని కుమారుడ వైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అందుకు యేసు –మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి –ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి–నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువు ను శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.