లేవీయ 19:19-37
లేవీయ 19:19-37 TSA
“ ‘నా శాసనాలు పాటించాలి. “ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు. “ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు. “ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు. “ ‘ఒక దాసికి మరొక పురుషునితో నిశ్చితార్థం జరిగి, ఆమె కోసం విమోచన క్రయధనం చెల్లించబడక, ఆమెకు విడుదల కలుగక ముందే ఎవడైనా ఆమెతో పడుకున్నట్లైతే సరియైన శిక్ష ఉండాలి. అయితే ఆమె స్వతంత్రురాలు కాదు, కాబట్టి వారు చంపబడాల్సిన అవసరం లేదు. అయినాసరే, ఆ పురుషుడు సమావేశ గుడార ద్వారం దగ్గరకు ఒక పొట్టేలును తెచ్చి యెహోవాకు అపరాధపరిహారబలి అర్పించాలి. యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది. “ ‘మీరు దేశంలోకి ప్రవేశించి, ఎలాంటి పండ్ల చెట్టునైన నాటితే, దాని పండును నిషేధించబడినదానిగా పరిగణించండి. మూడు సంవత్సరాల వరకు మీరు దానిని నిషేధించబడినదానిగా పరిగణించండి; అది తినకూడదు. నాలుగవ సంవత్సరం దాని పండు పరిశుద్ధంగా, యెహోవాకు స్తుతి యాగంగా ఉంటాయి. అయితే అయిదవ సంవత్సరంలో మీరు దాని పండు తినవచ్చు. ఈ విధంగా మీ పంట అధికమవుతుంది. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘ఏ మాంసమైన ఇంకా రక్తంతో ఉన్నప్పుడు తినకూడదు. “ ‘భవిష్యవాణి పాటించవద్దు లేదా శకునాలు చూడవద్దు. “ ‘మీ తల ప్రక్క వెంట్రుకలు కత్తిరించవద్దు లేదా మీ గడ్డం చివరలు చిన్నవిగా చేయవద్దు. “ ‘చనిపోయినవారి కోసం మీ శరీరాలు గాయపరచుకోకూడదు లేదా మీ దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను యెహోవాను. “ ‘మీ కుమార్తెను వేశ్యగా మార్చి ఆమెను దిగజార్చవద్దు, లేదా దేశం వ్యభిచారం వైపు తిరుగుతుంది, దుష్టత్వంతో నిండి ఉంటుంది. “ ‘నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను. “ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారి వైపు తిరగకండి లేదా ఆత్మలతో మాట్లాడేవారిని అనుసరించకండి, ఎందుకంటే మీరు వారి ద్వార అపవిత్రం అవుతారు. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘వృద్ధులు ఉన్నప్పుడు వారి ముందు నిలబడండి, వృద్ధులను గౌరవించండి, మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నేను యెహోవాను. “ ‘విదేశీయులు మీ దేశంలో మీ మధ్య నివసించినప్పుడు, వారిని చులకనగా చూడవద్దు. మీ మధ్య నివసించే పరదేశిని మీ స్థానికంగా జన్మించిన వానిగా పరిగణించాలి. మీలాగే వారిని ప్రేమించండి, ఎందుకంటే మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉండేవారు. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘పొడవు, బరువు లేదా పరిమాణాన్ని కొలిచేటప్పుడు నిజాయితీ లేని ప్రమాణాలను ఉపయోగించవద్దు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన తూనిక రాళ్లు, న్యాయమైన ఏఫా, న్యాయమైన హిన్ ఉపయోగించండి. నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను. “ ‘నా శాసనాలు, నా చట్టాలన్నిటిని జ్ఞాపకముంచుకొని వాటిని పాటించండి. నేను యెహోవాను.’ ”

