లేవీయకాండము 19:19-37 - Compare All Versions
లేవీయకాండము 19:19-37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘నా శాసనాలు పాటించాలి. “ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు. “ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు. “ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు. “ ‘ఒక దాసికి మరొక పురుషునితో నిశ్చితార్థం జరిగి, ఆమె కోసం విమోచన క్రయధనం చెల్లించబడక, ఆమెకు విడుదల కలుగక ముందే ఎవడైనా ఆమెతో పడుకున్నట్లైతే సరియైన శిక్ష ఉండాలి. అయితే ఆమె స్వతంత్రురాలు కాదు, కాబట్టి వారు చంపబడాల్సిన అవసరం లేదు. అయినాసరే, ఆ పురుషుడు సమావేశ గుడార ద్వారం దగ్గరకు ఒక పొట్టేలును తెచ్చి యెహోవాకు అపరాధపరిహారబలి అర్పించాలి. యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది. “ ‘మీరు దేశంలోకి ప్రవేశించి, ఎలాంటి పండ్ల చెట్టునైన నాటితే, దాని పండును నిషేధించబడినదానిగా పరిగణించండి. మూడు సంవత్సరాల వరకు మీరు దానిని నిషేధించబడినదానిగా పరిగణించండి; అది తినకూడదు. నాలుగవ సంవత్సరం దాని పండు పరిశుద్ధంగా, యెహోవాకు స్తుతి యాగంగా ఉంటాయి. అయితే అయిదవ సంవత్సరంలో మీరు దాని పండు తినవచ్చు. ఈ విధంగా మీ పంట అధికమవుతుంది. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘ఏ మాంసమైన ఇంకా రక్తంతో ఉన్నప్పుడు తినకూడదు. “ ‘భవిష్యవాణి పాటించవద్దు లేదా శకునాలు చూడవద్దు. “ ‘మీ తల ప్రక్క వెంట్రుకలు కత్తిరించవద్దు లేదా మీ గడ్డం చివరలు చిన్నవిగా చేయవద్దు. “ ‘చనిపోయినవారి కోసం మీ శరీరాలు గాయపరచుకోకూడదు లేదా మీ దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను యెహోవాను. “ ‘మీ కుమార్తెను వేశ్యగా మార్చి ఆమెను దిగజార్చవద్దు, లేదా దేశం వ్యభిచారం వైపు తిరుగుతుంది, దుష్టత్వంతో నిండి ఉంటుంది. “ ‘నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను. “ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారి వైపు తిరగకండి లేదా ఆత్మలతో మాట్లాడేవారిని అనుసరించకండి, ఎందుకంటే మీరు వారి ద్వార అపవిత్రం అవుతారు. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘వృద్ధులు ఉన్నప్పుడు వారి ముందు నిలబడండి, వృద్ధులను గౌరవించండి, మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నేను యెహోవాను. “ ‘విదేశీయులు మీ దేశంలో మీ మధ్య నివసించినప్పుడు, వారిని చులకనగా చూడవద్దు. మీ మధ్య నివసించే పరదేశిని మీ స్థానికంగా జన్మించిన వానిగా పరిగణించాలి. మీలాగే వారిని ప్రేమించండి, ఎందుకంటే మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉండేవారు. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘పొడవు, బరువు లేదా పరిమాణాన్ని కొలిచేటప్పుడు నిజాయితీ లేని ప్రమాణాలను ఉపయోగించవద్దు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన తూనిక రాళ్లు, న్యాయమైన ఏఫా, న్యాయమైన హిన్ ఉపయోగించండి. నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను. “ ‘నా శాసనాలు, నా చట్టాలన్నిటిని జ్ఞాపకముంచుకొని వాటిని పాటించండి. నేను యెహోవాను.’ ”
లేవీయకాండము 19:19-37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీరు నా శాసనాలను పాటించాలి. నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు. నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు. ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు. అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది. మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు. నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు. శకునాలు చూడకూడదు. మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు. విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు. చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది. నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను. చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను. తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను. మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు, మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను. కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.”
లేవీయకాండము 19:19-37 TERV (పవిత్ర బైబిల్)
“నా ఆజ్ఞలకు నీవు విధేయత చూపాలి. రెండురకాల పశువులను కలిసి సంతానోత్సత్తి చేయకూడదు. రెండు రకాల విత్తనాలు నీ పొలంలో నీవు చల్లకూడదు. రెండు రకాల మిశ్రమ దారాలతో నేయబడిన బట్టలు నీవు తొడగకూడదు. “మరొకని బానిస స్త్రీతో ఒకడు లైంగిక సంబంధాలు పెట్టుకోవటం సంభవించవచ్చు. అయితే ఈ బానిస స్త్రీ డబ్బుతో ఖరీదు చేయబడలేదు, లేక స్వతంత్రమూ పొందలేదు. ఇలా గనుక జరిగితే వారికి శిక్ష విధించాలి. కానీ వారికి మరణ శిక్ష లేదు. ఎందుచేతనంటే ఆ స్త్రీ స్వతంత్రురాలు కాదు. ఆ మగవాడు సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అపరాధపరిహారార్థ బలి అర్పణను తీసుకొని రావాలి. అపరాధపరిహారార్థ బలిగా ఒక గొర్రెపొట్టేలును అతడు తీసుకొని రావాలి. అతణ్ణి పవిత్రం చేసే కార్యాన్ని యాజకుడు జరిగిస్తాడు. ఆ పొట్టేలును అతడు చేసిన పాపం కోసం అపరాధపరిహారార్థ బలిగా యెహోవా ఎదుట యాజకుడు అర్పించాలి. అప్పుడు అతడు చేసిన పాపం విషయంలో అతడు క్షమాపణ పొందుతాడు. “ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్లు నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తినకూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు. నాలుగో సంవత్సరం ఆ చెట్టు ఫలం యెహోవాదే అవుతుంది. అది యెహోవాకు పవిత్ర స్తుతి అర్పణ. అప్పుడు అయిదో సంవత్సరం ఆ చెట్టు ఫలం మీరు తినవచ్చు. మరియు ఆ చెట్టు మీకు విస్తార ఫలాన్ని యిస్తుంది. నేను మీ దేవుడైన యెహోవాను. “ఇంకా, రక్తం ఉన్నది. ఏదీ మీరు తినకూడదు. “భవిష్యత్తుగూర్చి ముందుగా చెప్పటానికి మంత్ర తంత్రాలు ఏవీ మీరు ఉపయోగించకూడదు. “మీ తల చుట్టూ పెరిగే వెంట్రుకలను గుండ్రంగా క్షౌరం చేయకూడదు. మీ గడ్డం కొనలు కత్తిరించి వేయకూడదు. చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం మీరు మీ దేహాలను కోసుకోగూడదు. మీరు మీ ఒంటి మీద పచ్చలు పొడిపించుకోగూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. “మీ కుమార్తెను వేశ్యగా మార్చవద్దు. అలా చేయటం ఆమెపై మీకు గౌరవం లేదని వ్యక్తం చేస్తుంది. మీ దేశంలో ప్రజల్ని వేశ్యలు కానీయవద్దు. అలాంటి పాపంతో మీ దేశాన్ని నిండనీయవద్దు. “నా ప్రత్యేక విశ్రాంతి దినాల్లో మీరు పని చేయకూడదు. నా పవిత్రస్థలాన్ని మీరు ఘనంగా చూడాలి. నేను యెహోవాను. “సలహాకోసం కర్ణపిశాచులు, సోదెగాళ్ల దగ్గరకు వెళ్లకూడదు. వాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు, వారు మిమ్మల్ని అపవిత్రం చేస్తారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి. “వృద్ధులను గౌరవించండి. వారు గదిలోనికి వచ్చినప్పుడు లేచి నిలబడండి. మీ దేవునికి గౌరవం చూపెట్టండి. నేను యెహోవాను. “మీ దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కీడు చేయకండి. మీ స్వంత పౌరులను గౌరవించినట్టే, విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకొంటారో విదేశీయుల్ని కూడా అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన యెహోవాను. “ప్రజలు తీర్పు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచేటప్పుడ మీరు న్యాయంగా ఉండాలి. మీ తక్కెడలు సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తువుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేనే మిమ్మన్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను! “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను యెహోవాను!”
లేవీయకాండము 19:19-37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు నా కట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు. ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింప బడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరములవరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు. నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును; నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు, మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను. కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.