యెహోషువ 3:1-7

యెహోషువ 3:1-7 TSA

ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు. మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి. మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.” యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు. యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు. యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను.