యెహోషువ 3:1-7 - Compare All Versions
యెహోషువ 3:1-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు. మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి. మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.” యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు. యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు. యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను.
యెహోషువ 3:1-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెహోషువ వేకువనే లేచి అతడూ ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు. మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, “మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలం లో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి. మీకూ దానికీ దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు ఆ దారి గుర్తుపట్టాలి.” యెహోషువ ప్రజలతో “రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి” అన్నాడు. అతడు యాజకులతో “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి” అని చెప్పాడు. వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను.
యెహోషువ 3:1-7 TERV (పవిత్ర బైబిల్)
మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి, షిత్తీము విడిచి పెట్టారు. యొర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యొర్దాను నది దగ్గర గుడారాలు వేసారు. మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు. నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు, లేవీయులు మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి. కాని, మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు. అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు. తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసుకొనిపోయారు. అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు.
యెహోషువ 3:1-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరును షిత్తీమునుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. మూడుదినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి –మీరు మీ దేవుడైన యెహోవా నిబంధనమందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములోనుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను. మీకును దానికిని దాదాపు రెండువేల కొలమూరల యెడముండవలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లి నది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. –మీరు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను– నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.