ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి, వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము. ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే.
“ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది.
అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు.
రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది. ఆమె వారితో, “మీరు కొండ సీమకు వెళ్లండి, మిమ్మల్ని తరుముతున్నవారు మిమ్మల్ని పట్టుకోలేరు. వారు తిరిగి వచ్చేవరకు అక్కడే మూడు రోజులు దాక్కోండి, తర్వాత మీ దారిన మీరు వెళ్లవచ్చు” అని చెప్పింది.
అందుకు వారు ఆమెతో, “మేము నీతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా లేకపోతే మేము నిర్దోషులం: మేము ఈ దేశానికి వచ్చినప్పుడు, నీవు మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి ఈ ఎర్రని త్రాడును కట్టి మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి కట్టాలి, మీ అమ్మ నాన్నలను, మీ అన్నదమ్ములను, మీ కుటుంబమంతటిని నీ ఇంట్లోనే ఉంచాలి. ఒకవేళ నీ ఇంటి నుండి ఎవరైనా బయటి వీధిలోకి వెళ్తే వారి చావుకు వారే బాధ్యులు మేము బాధ్యులం కాము. అయితే నీ ఇంట్లో నీ దగ్గరున్న వారి మీద చేయి పడినా అది మా బాధ్యత. అయితే ఒకవేళ మా గురించి నీవు ఎవరికైనా చెప్తే, నీవు మాతో చేయించిన ప్రమాణం నుండి మేము విముక్తులం” అని అన్నారు.
అందుకామె, “సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి” అని చెప్పి వారిని పంపివేసింది.
వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ ఎర్రని త్రాడును కిటికీకి కట్టింది.