యోహాను సువార్త 6:41-51

యోహాను సువార్త 6:41-51 TSA

“పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు. వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు. యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు. ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను. ‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు. దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.