యోహాను 6:41-51

యోహాను 6:41-51 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు. వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు. యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు. ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను. ‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు. దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.

యోహాను 6:41-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

‘నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని’ అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు. “ఈయన యోసేపు కుమారుడు యేసు కదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా! ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని ఎలా చెబుతున్నాడు?” అనుకున్నారు. యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీలో మీరు సణుక్కోవడం ఆపండి. తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను. వారికి దేవుడు ఉపదేశిస్తాడు, అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గర నుండి వచ్చినవాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయనే తండ్రిని చూశాడు. కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు. జీవాహారం నేనే. మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.”

యోహాను 6:41-51 పవిత్ర బైబిల్ (TERV)

ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు. “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకం నుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి. నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను. ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ‘దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’ తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు. “ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది. నేను మీ జీవితానికి ఆహారాన్ని. మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. కాని ఈయన పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు. పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”

యోహాను 6:41-51 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహార మని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? –నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు–మీలో మీరు సణుగుకొనకుడి; నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. –వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవముగలవాడు. జీవాహారము నేనే. మీపితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.