యాకోబు పత్రిక 4:11-17

యాకోబు పత్రిక 4:11-17 TSA

నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు? “ఈ రోజైనా లేక రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అని చెప్పేవారలారా రండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది. కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. కాని మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది. కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.