యాకోబు 4:11-17
యాకోబు 4:11-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు? “ఈ రోజైనా లేక రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అని చెప్పేవారలారా రండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది. కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. కాని మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది. కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.
యాకోబు 4:11-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది. కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
యాకోబు 4:11-17 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు? వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు. అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు. అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది.
యాకోబు 4:11-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? –నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. కనుక–ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.