నిర్గమ 19:3-8
నిర్గమ 19:3-8 TSA
తర్వాత మోషే దేవుని దగ్గరకు ఎక్కి వెళ్లగా, ఆ పర్వతం నుండి యెహోవా అతన్ని పిలిచి, “యాకోబు వంశస్థులకు నీవు చెప్పాల్సింది, ఇశ్రాయేలు ప్రజలకు నీవు చెప్పాల్సింది ఇదే: ‘నేను ఈజిప్టుకు ఏమి చేశానో, గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకున్నది మీరే స్వయంగా చూశారు. మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా, మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు. మోషే తిరిగివెళ్లి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించి చెప్పమన్న మాటలన్నీ వారికి తెలియచేశాడు. ప్రజలంతా కలిసి స్పందించి, “యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము” అని అన్నారు. అప్పుడు మోషే వారి సమాధానాన్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్లాడు.

