నిర్గమకాండము 19:3-8 - Compare All Versions

నిర్గమకాండము 19:3-8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తర్వాత మోషే దేవుని దగ్గరకు ఎక్కి వెళ్లగా, ఆ పర్వతం నుండి యెహోవా అతన్ని పిలిచి, “యాకోబు వంశస్థులకు నీవు చెప్పాల్సింది, ఇశ్రాయేలు ప్రజలకు నీవు చెప్పాల్సింది ఇదే: ‘నేను ఈజిప్టుకు ఏమి చేశానో, గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకున్నది మీరే స్వయంగా చూశారు. మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా, మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు. మోషే తిరిగివెళ్లి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించి చెప్పమన్న మాటలన్నీ వారికి తెలియచేశాడు. ప్రజలంతా కలిసి స్పందించి, “యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము” అని అన్నారు. అప్పుడు మోషే వారి సమాధానాన్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్లాడు.

నిర్గమకాండము 19:3-8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు. ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా. మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు. మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు. అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు.

నిర్గమకాండము 19:3-8 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు మోషే పర్వతం మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు: ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను. కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.” కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు. తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు.

నిర్గమకాండము 19:3-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి–నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా –నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరు–యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.