ఒక రోజు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపించారు; ఇప్పుడు యెహోవా పంపిన సందేశాన్ని విను. సైన్యాల యెహోవా చెప్పింది ఇదే, ‘ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు దారిలో వారిని అడ్డగించినందుకు నేను వారిని శిక్షిస్తాను. కాబట్టి నీవు ఇప్పుడు వెళ్లి అమాలేకీయుల మీద దాడిచేసి వారికి చెందిన వాటన్నిటిని నాశనం చేయాలి. వారిని విడిచిపెట్టవద్దు; పురుషులను స్త్రీలను, పిల్లలను చంటిబిడ్డలను, పశువులను గొర్రెలను, ఒంటెలను, గాడిదలనన్నిటిని చంపివేయాలి.’ ” కాబట్టి సౌలు ప్రజలను పిలిపించి తెలాయీములో వారిని లెక్కించగా కాల్బలం రెండు లక్షలమంది యూదా వారు పదివేలమంది ఉన్నారు. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి ఒక కనుమలో పొంచి ఉన్నాడు. అప్పుడు సౌలు కెనీయులతో, “ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు మీరు వారందరి పట్ల దయ చూపించారు కాబట్టి నేను అమాలేకీయులతో పాటు మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు అమాలేకీయులను విడిచిపెట్టి వెళ్లిపొండి” అని చెప్పినప్పుడు కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయారు. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఈజిప్టు దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉన్న షూరు వరకు తరిమి చంపి, అమాలేకీయుల రాజైన అగగును ప్రాణాలతో పట్టుకుని అతని ప్రజలందరినీ కత్తితో పూర్తిగా నాశనం చేశాడు. అయితే సౌలు అతని సైన్యం అగగును, గొర్రెలలో పశువుల్లో మంచివాటిని క్రొవ్విన దూడలను గొర్రెపిల్లలను నాశనం చేయక పనికిరాని వాటిని బలహీనమైన వాటిని పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు, “సౌలు నా నుండి దూరమై నేను చెప్పిన దానిని చేయలేదు కాబట్టి నేను సౌలును రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.” అందుకు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడు. ఉదయాన్నే సమూయేలు లేచి సౌలును కలవడానికి వెళ్లగా, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. అక్కడ తన విజయానికి గుర్తుగా స్థూపాన్ని నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లాడు” అని చెప్పారు. తర్వాత సమూయేలు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు, “యెహోవా నిన్ను దీవిస్తారు! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను” అన్నాడు. అందుకు సమూయేలు, “అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి?” అని అడిగాడు. అందుకు సౌలు, “అమాలేకీయుల దగ్గర నుండి సైన్యం వాటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వారు గొర్రెలలో పశువుల్లో మంచి వాటిని వేరుగా ఉంచారు; మిగిలిన వాటన్నిటిని మేము పూర్తిగా నాశనం చేశాము” అని జవాబు ఇచ్చాడు. సమూయేలు, “నీవు మాట్లాడే అవసరం లేదు. గత రాత్రి యెహోవా నాతో చెప్పిన మాట నీకు చెప్తాను విను” అన్నాడు. సౌలు చెప్పమని అన్నాడు. అప్పుడు సమూయేలు, “నీ దృష్టికి నీవు అల్పమైనవానిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యుడవయ్యావు కదా? యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించారు. అలాగే యెహోవా, ‘నీవు వెళ్లి దుష్టులైన అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయి; వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు వారితో యుద్ధం చేయి’ అని చెప్పి నీకు ఒక కర్తవ్యాన్ని అప్పగించి పంపారు. నీవెందుకు యెహోవాకు లోబడలేదు? ఎందుకు దోపుడుసొమ్ము మీద పడి యెహోవా దృష్టికి కీడు చేశావు” అన్నాడు. అందుకు సౌలు సమూయేలుతో, “ఆ మాట అనవద్దు: నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో వెళ్లి నేను అమాలేకీయులనందరిని పూర్తిగా నాశనం చేసి అమాలేకీయుల రాజైన అగగును తీసుకువచ్చాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి సైనికులు దోచుకున్న గొర్రెలలో పశువుల్లో మంచివి, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకువచ్చారు” అని చెప్పాడు.
చదువండి 1 సమూయేలు 15
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 15:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు