1 సమూయేలు 15:1-21

1 సమూయేలు 15:1-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒక రోజు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపించారు; ఇప్పుడు యెహోవా పంపిన సందేశాన్ని విను. సైన్యాల యెహోవా చెప్పింది ఇదే, ‘ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు దారిలో వారిని అడ్డగించినందుకు నేను వారిని శిక్షిస్తాను. కాబట్టి నీవు ఇప్పుడు వెళ్లి అమాలేకీయుల మీద దాడిచేసి వారికి చెందిన వాటన్నిటిని నాశనం చేయాలి. వారిని విడిచిపెట్టవద్దు; పురుషులను స్త్రీలను, పిల్లలను చంటిబిడ్డలను, పశువులను గొర్రెలను, ఒంటెలను, గాడిదలనన్నిటిని చంపివేయాలి.’ ” కాబట్టి సౌలు ప్రజలను పిలిపించి తెలాయీములో వారిని లెక్కించగా కాల్బలం రెండు లక్షలమంది యూదా వారు పదివేలమంది ఉన్నారు. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి ఒక కనుమలో పొంచి ఉన్నాడు. అప్పుడు సౌలు కెనీయులతో, “ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు మీరు వారందరి పట్ల దయ చూపించారు కాబట్టి నేను అమాలేకీయులతో పాటు మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు అమాలేకీయులను విడిచిపెట్టి వెళ్లిపొండి” అని చెప్పినప్పుడు కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయారు. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఈజిప్టు దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉన్న షూరు వరకు తరిమి చంపి, అమాలేకీయుల రాజైన అగగును ప్రాణాలతో పట్టుకుని అతని ప్రజలందరినీ కత్తితో పూర్తిగా నాశనం చేశాడు. అయితే సౌలు అతని సైన్యం అగగును, గొర్రెలలో పశువుల్లో మంచివాటిని క్రొవ్విన దూడలను గొర్రెపిల్లలను నాశనం చేయక పనికిరాని వాటిని బలహీనమైన వాటిని పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు, “సౌలు నా నుండి దూరమై నేను చెప్పిన దానిని చేయలేదు కాబట్టి నేను సౌలును రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.” అందుకు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడు. ఉదయాన్నే సమూయేలు లేచి సౌలును కలవడానికి వెళ్లగా, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. అక్కడ తన విజయానికి గుర్తుగా స్థూపాన్ని నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లాడు” అని చెప్పారు. తర్వాత సమూయేలు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు, “యెహోవా నిన్ను దీవిస్తారు! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను” అన్నాడు. అందుకు సమూయేలు, “అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి?” అని అడిగాడు. అందుకు సౌలు, “అమాలేకీయుల దగ్గర నుండి సైన్యం వాటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వారు గొర్రెలలో పశువుల్లో మంచి వాటిని వేరుగా ఉంచారు; మిగిలిన వాటన్నిటిని మేము పూర్తిగా నాశనం చేశాము” అని జవాబు ఇచ్చాడు. సమూయేలు, “నీవు మాట్లాడే అవసరం లేదు. గత రాత్రి యెహోవా నాతో చెప్పిన మాట నీకు చెప్తాను విను” అన్నాడు. సౌలు చెప్పమని అన్నాడు. అప్పుడు సమూయేలు, “నీ దృష్టికి నీవు అల్పమైనవానిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యుడవయ్యావు కదా? యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించారు. అలాగే యెహోవా, ‘నీవు వెళ్లి దుష్టులైన అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయి; వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు వారితో యుద్ధం చేయి’ అని చెప్పి నీకు ఒక కర్తవ్యాన్ని అప్పగించి పంపారు. నీవెందుకు యెహోవాకు లోబడలేదు? ఎందుకు దోపుడుసొమ్ము మీద పడి యెహోవా దృష్టికి కీడు చేశావు” అన్నాడు. అందుకు సౌలు సమూయేలుతో, “ఆ మాట అనవద్దు: నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో వెళ్లి నేను అమాలేకీయులనందరిని పూర్తిగా నాశనం చేసి అమాలేకీయుల రాజైన అగగును తీసుకువచ్చాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి సైనికులు దోచుకున్న గొర్రెలలో పశువుల్లో మంచివి, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకువచ్చారు” అని చెప్పాడు.

1 సమూయేలు 15:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఒక రోజున సమూయేలు సౌలును పిలిచి ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలపై నిన్ను రాజుగా అభిషేకించడానికి యెహోవా నన్ను పంపించాడు. ఆయన మాట విను. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ‘అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడు నాకు జ్ఞాపకం ఉంది. వారు ఐగుప్తు విడిచి రాగానే మార్గ మధ్యంలో అమాలేకీయులు వారిపైకి వచ్చి దాడి చేశారు కదా. కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి ఎవ్వరి పట్లా కనికరం చూపకుండా అమాలేకీయులను హతం చెయ్యి. పురుషులైనా, స్త్రీలైనా, చిన్నపిల్లలైనా, పసిపిల్లలైనా, ఎద్దులైనా, గొర్రెలైనా, ఒంటెలైనా, గాడిదలైనా వేటినీ విడిచిపెట్టక వారికి ఉన్నదంతా నాశనం చేసి, అమాలేకీయులందరినీ నిర్మూలం చెయ్యి’” అని చెప్పాడు. అప్పుడు సౌలు ప్రజలను తెలాయీములో పోగుచేసి వారిని లెక్కించాడు. కాల్బలం రెండు లక్షలమంది, యూదావారు పదివేలమంది పోగయ్యారు. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి లోయలో పొంచి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కేనీయులు వారికి సహాయం చేశారు గనుక అమాలేకీయులతో కలసి ఉన్న కేనీయులు కూడా నాశనం కాకుండా ఉండేలా వారిని బయలుదేరి వెళ్ళిపొమ్మని కేనీయులకు సమాచారం పంపినపుడు కేనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్లిపోయారు. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకూ తరిమి సంహరించి అమాలేకీయుల రాజు అగగును సజీవంగా పట్టుకుని, మిగిలిన వారందరినీ కత్తితో నాశనం చేశాడు. సౌలు, అతని ప్రజలు కలసి అగగును, గొర్రెలు, ఎద్దులు, బాగా బలిసిన గొర్రెపిల్లలు మొదలైనవాటిలో మంచివాటినీ నాశనం చేయకుండా వేరుగా ఉంచి, పనికిరాని వాటిని, నాసిరకం వాటిని చంపివేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైఇలా చెప్పాడు, “సౌలు నేను చెప్పినది చేయకుండా నా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు గనుక అతణ్ణి రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.” అప్పుడు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రి అంతా యెహోవాకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తెల్లవారగానే సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్ళినప్పుడు సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ విజయ స్మారక స్థూపం నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లిపోయాడని తెలుసుకున్నాడు. తరువాత అతడు సౌలు దగ్గరకి వచ్చినపుడు సౌలు “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక, యెహోవా చెప్పిన మాట నేను జరిగించాను” అన్నాడు. అప్పుడు సమూయేలు “అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఎక్కడివి?” అని అడిగాడు. అందుకు సౌలు “అమాలేకీయుల నుండి ప్రజలు వీటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ప్రజలు గొర్రెల్లో, ఎద్దుల్లో మంచివాటిని చంపకుండా ఉండనిచ్చారు. మిగిలిన వాటన్నిటినీ మేము హతం చేశాం” అన్నాడు. సమూయేలు “నీవు మాట్లాడవలసిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో చెప్పిన మాట నీకు చెబుతున్నాను విను” అన్నాడు. సౌలు “చెప్పండి” అన్నాడు. అప్పుడు సమూయేలు “నీ విషయంలో నువ్వు అల్పుడవుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు. యెహోవా నిన్ను పంపించి ‘నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను నాశనం చెయ్యి, వారు సమూలంగా అంతమయ్యే వరకూ వారితో యుద్ధం చెయ్యి’ అని చెప్పినప్పుడు, నువ్వు యెహోవా మాట వినకుండా దోచుకున్న దాన్ని ఆశించి ఆయన విషయంలో ఎందుకు తప్పు చేశావు?” అన్నాడు. అప్పుడు సౌలు “అలా అనకు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన వెళ్ళి అమాలేకీయుల రాజైన అగగును మాత్రమే తీసుకు వచ్చాను కాని అమాలేకీయులందరినీ నాశనం చేశాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు శపితమైన గొర్రెల్లో, ఎద్దుల్లో శ్రేష్ఠమైనవాటిని తీసుకువచ్చారు” అని సమూయేలుతో చెప్పాడు.

1 సమూయేలు 15:1-21 పవిత్ర బైబిల్ (TERV)

సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయటానికి యెహోవా తనను పంపిన విషయం జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర నుండి తెచ్చినట్లు సమూయేలు చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా వర్తమానం ఇది: “ఈజిప్టునుండి విముక్తి పొంది ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు వారిని కనానుకు పోకుండా ఆపాలని అమాలేకీయులు ప్రయత్నించారు. అమాలేకీయులు ఏమి చేశారో నేను స్వయంగా చూశాను. నీవు ఇప్పుడు వెళ్లు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించు. నీవు అమాలేకీయులను సర్వనాశనం చేయాలి. అంతేగాదు, వారికి చెందిన ప్రతి వస్తువూ నాశనం కావాలి. దేనినీ బతకనివ్వకు. పురుషులను, స్త్రీలను, పిల్లలను పసివాళ్లను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను-అన్నింటినీ హతమార్చి వేయాలి.” సౌలు సైన్యాన్ని పిలిచి తెలాయీము వద్ద సమీకరించాడు. సైనికులు రెండు లక్షలమంది ఉన్నారు. అందులో పదివేలమంది యూదాకు చెందినవారు. సౌలు అమాలేకీయుల ఒక నగర సమీపానికి వెళ్లి లోయలో పొంచివున్నాడు. ఆ ప్రాంతంలో కేనీయులు కూడా వున్నారు. సౌలు వారితో అమాలేకీయులను వదిలి వెళ్లిపొమ్మన్నాడు. అలా వెళ్తే అమాలే కీయులతో పాటు వారిని చంపనని చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీరు వారికి కనికరము చూపారు గనుక మిమ్మల్ని చంపను” అని సౌలు అన్నాడు. అది విని అమాలేకీయులనుండి విడి పోయి కేనీయులు వెళ్లిపోయారు. అమాలేకీయులను సౌలు ఓడించాడు. హవీలా నుండి ఈజిప్టు సరిహద్దుల్లోని షూరు పట్టణం వరకూ సౌలు వారితో పోరాడాడు. అమాలేకీయుల రాజైన అగగును మాత్రం సజీవంగా పట్టుకుని అతని సైన్యం అంతటినీ సౌలు చంపేసాడు. సౌలు, మరియు ఇశ్రాయేలు సైనికులు అగగును బతకనిచ్చారు. బలంగా, ఆరోగ్యంగావున్న గొర్రెలను, పశువులను, గొర్రెపిల్లలను కూడా వారు వదిలివేశారు. ప్రయోజన కరమైన వాటన్నింటినీ చంపకుండా విడిచిపెట్టి వారికి అవసరం లేని వాటన్నింటినీ వారు చంపేసారు. యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది. “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు. మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు. కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటిని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు. సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు. “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు. సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.” సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో. సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు. సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవైనావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు. యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. ‘వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి’ అని యెహోవా చెప్పాడు. కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.” సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అగగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను. సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.

1 సమూయేలు 15:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము. సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతముచేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి –ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలోనుండి వెళ్లిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –సౌలు నన్ను అనుస రింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు నొద్దకురాగా సౌలు–యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు–ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను. అందుకు సౌలు–అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితిమనగా సమూయేలు–నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు–చెప్పుమనెను. అందుకు సమూయేలు– నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు–ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.