కీర్తనల గ్రంథము 31:1-8
కీర్తనల గ్రంథము 31:1-8 TERV
యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపరచవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము. దేవా, నా మాట ఆలకించుము. వేగంగా వచ్చి నన్ను రక్షించి నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము. నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము. దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము. నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం. యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. నన్ను రక్షించుము. వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను. దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. నా కష్టాలు నీవు చూశావు. నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు. నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.

