సామెతలు 23:1-18

సామెతలు 23:1-18 TERV

నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం ఉంచుకో. నీకు చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ మరీ ఎక్కువ తినవద్దు. అతడు వడ్డించే శ్రేష్ఠమైం భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తుగడకావచ్చు. ధనవంతుడు అవ్వాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు. పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది. స్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి వచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు. అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. “తినుము, త్రాగుము” అని అతడు నీతో చెప్పవచ్చు. కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు. అతని భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు యిబ్బంది పడిపోతావు. తెలివి తక్కువ వానికి నేర్పించేందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు. ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసికొనవద్దు. యెహోవా నీకు విరోధంగా ఉంటాడు. యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడుతాడు. నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో. ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు. నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు. నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం. నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను. దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు. ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు.