సామెతలు 23:1-18

సామెతలు 23:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు. నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును. ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయము కూడ సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.

సామెతలు 23:1-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు, అవి మోసగించే ఆహారపదార్థాలు. సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు. కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది. ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు, ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు. “తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు, కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు. నీవు తినిన కొంచెము కక్కివేస్తావు నీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి. బుద్ధిహీనులతో మాట్లాడకండి, ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు. పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దు తండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు, ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు. ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు. నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు. బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి. నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది; నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది. పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు. నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు.

సామెతలు 23:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు. నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి. ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి. డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది. దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది. బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు. ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు. బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు.

సామెతలు 23:1-18 పవిత్ర బైబిల్ (TERV)

నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం ఉంచుకో. నీకు చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ మరీ ఎక్కువ తినవద్దు. అతడు వడ్డించే శ్రేష్ఠమైం భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తుగడకావచ్చు. ధనవంతుడు అవ్వాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు. పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది. స్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి వచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు. అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. “తినుము, త్రాగుము” అని అతడు నీతో చెప్పవచ్చు. కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు. అతని భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు యిబ్బంది పడిపోతావు. తెలివి తక్కువ వానికి నేర్పించేందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు. ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసికొనవద్దు. యెహోవా నీకు విరోధంగా ఉంటాడు. యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడుతాడు. నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో. ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు. నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు. నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం. నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను. దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు. ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు.