తమ యూదా సోదరుల మీద చాలామంది బీదవాళ్లు ఫిర్యాదు చేయసాగారు. వాళ్లలో కొందరు, “మాకు చాలామంది పిల్లపాపలు వున్నారు. మేముతిండి తిని బ్రతికి వుండాలంటే, మాకు ధాన్యము దొరకాలి!” అన్నారు.
మరికొందరు, “ఇది కరువు కాలం. మేము ధాన్యము కోసం మా పొలాలు, ద్రాక్షతోటలు, ఇళ్లు కుదువ పెట్టాల్సి వస్తోంది” అని మొత్తుకున్నారు.
వేరే కొందరు, “మేము మా పొలాలకీ, ద్రాక్షాతోటలకీ రాజు విధించిన పన్నులు చెల్లించాలి. అయితే, ఆ పన్నులు చెల్లించేందుకు మా దగ్గర డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తోంది. ఆ ధనికుల్ని చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బానిసలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, ద్రాక్షాతోటలను కోల్పోయాము! అవి ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు.
వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం వచ్చింది. నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుంబాల దగ్గరికీ, ఉద్యోగుల వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించుకొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట సమావేశ పరచి, వాళ్లతో ఇలా చెప్పాను, “మన యూదా సోదరులు ఇతర దేశాల వాళ్లకి బానిసలుగా అమ్మబడుతున్నారు. మనం వాళ్లని కొని, వాళ్లని స్వతంత్రులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాము. కాని ఇప్పడు మీరు మళ్లీ వాళ్లని బానిసలుగా అమ్మేస్తున్నారు!”
ఆ ధనికులూ, ఉద్యోగులూ మౌనంగా ఉండి పోయారు. వాళ్లకి ఏమి చెప్పేందుకూ తోచలేదు. సరే, నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి వుండాలన్న విషయం మీకు తెలుసు ఇతరులు చేసే సిగ్గుచేటైన పనులు మీరు చెయ్యకూడదు! నా మనుష్యులూ, నా సోదరులూ, నేను కూడా డబ్బూ, ధాన్యము అప్పుగా ఇస్తున్నాను. అయితే, ఆ అప్పుల మీద వడ్డీ చెల్లించమని నిర్బంధించడం మనం మానుకోవాలి! మీరు వాళ్లనుంచి తీసుకున్న పొలాలు, ద్రాక్షాతోటలు, ఒలీవ పొలాలు, ఇళ్లు వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! మీరు వాళ్ల దగ్గర వసూలు చేసిన వడ్డీ సొమ్ము కూడా వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! వాళ్లకి అప్పుగా ఇచ్చిన డబ్బుకు, ధాన్యానికీ, తాజా ద్రాక్షారసానికి, ఒలీవ నూనెకు మీరు ఒక శాతం వడ్డి తీసుకుంటున్నారు. మీరు సొమ్ము వాళ్లకి తిరిగి ఇచ్చెయ్యాలి!”
అప్పుడా ధనవంతులూ, ఉద్యోగులూ ఇలా సమాధానమిచ్చారు, “మేము వారి ఆస్తులను, వారిమీద వేసిన వడ్డీలను తిరిగి ఇచ్చేస్తాము. మేము వాళ్ల దగ్గర్నుంచి ఇంకేమీ అడగము. నెహెమ్యా, మేము నీవు చెప్పినట్లే చేస్తాము.”
తర్వాత నేను యాజకులను పిలిచాను. ధనికులచేతా, ఉద్యోగులచేతా తాము చెప్పిన మాటలను అమలు చేస్తామని యాజకుల సమక్షంలో దేవునికి ప్రమాణం చేసేలా చూశాను. తర్వాత నేను నా దుస్తుల మడతలు పోయేలా వాటిని దులిపి, ఇలా చెప్పాను, “తన వాగ్దాన భంగం చేసిన ప్రతివానికీ దేవుడు ఇదే చేస్తాడు. దేవుడు వాళ్లని వాళ్ల ఇళ్ల నుంచి బయటికి విసిరిపారేస్తాడు. తాము కూడబెట్టుకున్న వన్నీ వాళ్లు కోల్పోతారు! ఆ వ్యక్తి తన సర్వస్వం కోల్పోతాడు!”
నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ వాళ్లందరూ ఒప్పుకొనెదమని చెప్పిరి. వాళ్లంతా, “ఆమేన్!” అన్నారు. యెహోవాను స్తుతించారు. ఆ మనుష్యులు తాము ఒప్పుకొన్న ప్రకారం అన్ని జరిగించిరి.
అంతే కాదు, యూదా ప్రాంతానికి నేను అధికారిగా వున్నంత కాలం, నేనుగాని, నా సోదరులుగాని పాలనాధికారికి అనుమతింపబడిన ఆహారం ఎన్నడూ తినలేదు. నా ఆహారం కొనే నిమిత్తం నేనెన్నడూ జనాన్ని పన్నులు చెల్లించేలా నిర్బంధించలేదు. నేను అర్తహషస్త రాజ్య పాలనలో ఇరవయ్యవ ఏడాది నుంచి ముప్పై రెండవ ఏడాది దాకా పాలనాధికారిగా వున్నాను. నేను యూదాకి పన్నెండేళ్లపాటు పాలనాధికారిగా వున్నాను. కాని, నా కంటె ముందు పాలించిన అధికార్లు జన జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్కరినుంచీ నిర్బంధంగా నలభై తులాల వెండిని వసూలు చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహారాన్నీ, ద్రాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ల కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలాయించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయభక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్లు చేసిన పనులేవీ చేయలేదు. యెరూషలేము ప్రాకార నిర్మాణానికి నేను బాగా కష్టించి పనిచేశాను. నా మనుష్యులందరూ ప్రాకార నిర్మాణం కోసం అక్కడ చేరారు. మేము ఏ ఒక్కరి దగ్గరినుంచీ భూమి సంపాదించుకోలేదు!