నెహెమ్యా 5:1-16

నెహెమ్యా 5:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తర్వాత ప్రజలు వారి భార్యలు తమ తోటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. కొందరు, “మేమూ, మా కుమారులు కుమార్తెలు కలిపి చాలామంది ఉన్నాము కాబట్టి మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇవ్వండి” అన్నారు. మరికొందరు, “కరువు సమయంలో ధాన్యం పొందడానికి మేము మా పొలాలను ద్రాక్షతోటలను మా ఇళ్ళను తాకట్టు పెడుతున్నాం” అన్నారు. ఇంకా కొందరు, “రాజుకు పన్ను చెల్లించడానికి మా పొలాలు ద్రాక్షతోటల మీద డబ్బు అప్పుగా తీసుకున్నాము. మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు. వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను. అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి, “యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా? నేను, నా సోదరులు నా పనివారు కూడా ప్రజలకు డబ్బు ధాన్యం అప్పుగా ఇచ్చాము. కాని ఆ అప్పులన్నీ రద్దు చేస్తున్నాము. ఈ రోజే మీరు వారి దగ్గర నుండి తీసుకున్న పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, ఇల్లు వారికి తిరిగి ఇచ్చేయండి. అలాగే వారి నుండి వసూలు చేసిన వడ్డీ డబ్బులు ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో ఒక శాతం వారికి అప్పగించండి” చెప్పాను. అందుకు వారు, “మేము అన్ని తిరిగి ఇచ్చేస్తాము. వారి నుండి ఇక ఏమి ఆశించము. నీవు చెప్పినట్లే చేస్తాం” అన్నారు. అప్పుడు నేను యాజకులను పిలిపించి వారు చేసిన వాగ్దానం ప్రకారం చేస్తామని చెప్పి సంస్థానాధిపతులతో, అధికారులతో ప్రమాణం చేయించాను. నేను కూడా నా బట్టలు దులిపి వారితో, “ఈ విధంగా దేవుడు తమ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరిని వారి ఇళ్ళ నుండి ఆస్తినుండి దులిపి వేస్తారు. అప్పుడు వాడు ఏమి లేనివానిగా అవుతాడు” అని చెప్పాను. అప్పుడు అక్కడ సమావేశమైన వారంతా ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా తమ వాగ్దానం ప్రకారం చేశారు. నేను యూదా దేశంలో వారికి అధిపతిగా నియమించబడినప్పటి నుండి అనగా అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను గాని నా సోదరులు గాని అధిపతికి ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేదు. నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు. నేను శ్రద్ధగా గోడ పని చేశాను. నా పనివారు అంతా కలిసి అదే పని చేశారు. మేము భూమి సంపాదించుకోలేదు.

నెహెమ్యా 5:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొందరు వచ్చి “మేమూ, మా కొడుకులూ కూతుళ్ళు చాలామంది ఉన్నాం. మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు” అన్నారు. మరి కొంతమంది “కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను, మా ఇళ్ళను తాకట్టు పెట్టాం, కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి” అన్నారు. మరికొందరు “రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను, ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాం. మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు. ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది. అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను. “ఇతర ప్రజలకు అమ్ముడుబోయిన మన సోదర యూదులను మా శక్తి కొద్దీ విడిపించాం. మళ్ళీ మన సాటి యూదులు అమ్ముడుబోయేలా మీరు చేస్తున్నారా?” అని వారితో అన్నాను. వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. నేను ఇలా అన్నాను “మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా? నేనూ నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం. ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.” అప్పుడు వాళ్ళు “నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం” అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళచేత ప్రమాణం చేయించాను. నేను నా దుప్పటి దులిపి “ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వ్యక్తినీ అతని ఇంట్లో, ఆస్తిలో పాలు లేకుండా దేవుడు దులిపి వేస్తాడు గాక. ఆ విధంగా అలాంటివాడు దులిపి వేసినట్టుగా అన్నీ పోగొట్టుకుంటాడు” అని చెప్పాను. సమాజమంతా “అలాగే జరుగుతుంది గాక” అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా ఈ వాగ్దానం ప్రకారం చేశారు. నేను యూదా దేశంలో వారికి అధికారిగా వచ్చినప్పటినుండి, అంటే అర్తహషస్త రాజు పాలనలో 20 వ సంవత్సరం నుండి 32 వ సంవత్సరం దాకా ఈ 12 సంవత్సరాలు అధికారిగా నాకు రావలసిన ఆహార పదార్థాలను నేను గానీ, నా బంధువులు గానీ తీసుకోలేదు. అయితే నాకు ముందున్న అధికారులు ప్రజల నుండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాల వెండి చొప్పున తీసుకుంటూ వచ్చారు. వారి సేవకులు కూడా ప్రజలపై ఆధికారం చెలాయించేవారు. అయితే దేవుని పట్ల భయభక్తులు ఉన్న కారణంగా నేనలా చేయలేదు. నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలసి పని చేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు.

నెహెమ్యా 5:1-16 పవిత్ర బైబిల్ (TERV)

తమ యూదా సోదరుల మీద చాలామంది బీదవాళ్లు ఫిర్యాదు చేయసాగారు. వాళ్లలో కొందరు, “మాకు చాలామంది పిల్లపాపలు వున్నారు. మేముతిండి తిని బ్రతికి వుండాలంటే, మాకు ధాన్యము దొరకాలి!” అన్నారు. మరికొందరు, “ఇది కరువు కాలం. మేము ధాన్యము కోసం మా పొలాలు, ద్రాక్షతోటలు, ఇళ్లు కుదువ పెట్టాల్సి వస్తోంది” అని మొత్తుకున్నారు. వేరే కొందరు, “మేము మా పొలాలకీ, ద్రాక్షాతోటలకీ రాజు విధించిన పన్నులు చెల్లించాలి. అయితే, ఆ పన్నులు చెల్లించేందుకు మా దగ్గర డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తోంది. ఆ ధనికుల్ని చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బానిసలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, ద్రాక్షాతోటలను కోల్పోయాము! అవి ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు. వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం వచ్చింది. నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుంబాల దగ్గరికీ, ఉద్యోగుల వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించుకొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట సమావేశ పరచి, వాళ్లతో ఇలా చెప్పాను, “మన యూదా సోదరులు ఇతర దేశాల వాళ్లకి బానిసలుగా అమ్మబడుతున్నారు. మనం వాళ్లని కొని, వాళ్లని స్వతంత్రులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాము. కాని ఇప్పడు మీరు మళ్లీ వాళ్లని బానిసలుగా అమ్మేస్తున్నారు!” ఆ ధనికులూ, ఉద్యోగులూ మౌనంగా ఉండి పోయారు. వాళ్లకి ఏమి చెప్పేందుకూ తోచలేదు. సరే, నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి వుండాలన్న విషయం మీకు తెలుసు ఇతరులు చేసే సిగ్గుచేటైన పనులు మీరు చెయ్యకూడదు! నా మనుష్యులూ, నా సోదరులూ, నేను కూడా డబ్బూ, ధాన్యము అప్పుగా ఇస్తున్నాను. అయితే, ఆ అప్పుల మీద వడ్డీ చెల్లించమని నిర్బంధించడం మనం మానుకోవాలి! మీరు వాళ్లనుంచి తీసుకున్న పొలాలు, ద్రాక్షాతోటలు, ఒలీవ పొలాలు, ఇళ్లు వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! మీరు వాళ్ల దగ్గర వసూలు చేసిన వడ్డీ సొమ్ము కూడా వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! వాళ్లకి అప్పుగా ఇచ్చిన డబ్బుకు, ధాన్యానికీ, తాజా ద్రాక్షారసానికి, ఒలీవ నూనెకు మీరు ఒక శాతం వడ్డి తీసుకుంటున్నారు. మీరు సొమ్ము వాళ్లకి తిరిగి ఇచ్చెయ్యాలి!” అప్పుడా ధనవంతులూ, ఉద్యోగులూ ఇలా సమాధానమిచ్చారు, “మేము వారి ఆస్తులను, వారిమీద వేసిన వడ్డీలను తిరిగి ఇచ్చేస్తాము. మేము వాళ్ల దగ్గర్నుంచి ఇంకేమీ అడగము. నెహెమ్యా, మేము నీవు చెప్పినట్లే చేస్తాము.” తర్వాత నేను యాజకులను పిలిచాను. ధనికులచేతా, ఉద్యోగులచేతా తాము చెప్పిన మాటలను అమలు చేస్తామని యాజకుల సమక్షంలో దేవునికి ప్రమాణం చేసేలా చూశాను. తర్వాత నేను నా దుస్తుల మడతలు పోయేలా వాటిని దులిపి, ఇలా చెప్పాను, “తన వాగ్దాన భంగం చేసిన ప్రతివానికీ దేవుడు ఇదే చేస్తాడు. దేవుడు వాళ్లని వాళ్ల ఇళ్ల నుంచి బయటికి విసిరిపారేస్తాడు. తాము కూడబెట్టుకున్న వన్నీ వాళ్లు కోల్పోతారు! ఆ వ్యక్తి తన సర్వస్వం కోల్పోతాడు!” నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ వాళ్లందరూ ఒప్పుకొనెదమని చెప్పిరి. వాళ్లంతా, “ఆమేన్!” అన్నారు. యెహోవాను స్తుతించారు. ఆ మనుష్యులు తాము ఒప్పుకొన్న ప్రకారం అన్ని జరిగించిరి. అంతే కాదు, యూదా ప్రాంతానికి నేను అధికారిగా వున్నంత కాలం, నేనుగాని, నా సోదరులుగాని పాలనాధికారికి అనుమతింపబడిన ఆహారం ఎన్నడూ తినలేదు. నా ఆహారం కొనే నిమిత్తం నేనెన్నడూ జనాన్ని పన్నులు చెల్లించేలా నిర్బంధించలేదు. నేను అర్తహషస్త రాజ్య పాలనలో ఇరవయ్యవ ఏడాది నుంచి ముప్పై రెండవ ఏడాది దాకా పాలనాధికారిగా వున్నాను. నేను యూదాకి పన్నెండేళ్లపాటు పాలనాధికారిగా వున్నాను. కాని, నా కంటె ముందు పాలించిన అధికార్లు జన జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్కరినుంచీ నిర్బంధంగా నలభై తులాల వెండిని వసూలు చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహారాన్నీ, ద్రాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ల కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలాయించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయభక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్లు చేసిన పనులేవీ చేయలేదు. యెరూషలేము ప్రాకార నిర్మాణానికి నేను బాగా కష్టించి పనిచేశాను. నా మనుష్యులందరూ ప్రాకార నిర్మాణం కోసం అక్కడ చేరారు. మేము ఏ ఒక్కరి దగ్గరినుంచీ భూమి సంపాదించుకోలేదు!

నెహెమ్యా 5:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తమ సహోదరులైన యూదులమీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి. ఏదనగా కొందరు –మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేముతిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి. మరికొందరు–క్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితిమి గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి. మరికొందరు–రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి–మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి –అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను–మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా? నేనును నా బంధువులును నా దాసులును కూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి; ఆ అప్పు పుచ్చుకొనకుందము. ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారు–నీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపి–ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాటచొప్పుననే జరిగించిరి. మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు. అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనులమీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడపనిచేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.