1 రాజులు 11:26-43

1 రాజులు 11:26-43 TERV

నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు. యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు. యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు. ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు. అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు. అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను. కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను. సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్తారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు. కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు. ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను. సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను. కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు. నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను. ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.’” సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు. తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు. తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.