1 రాజులు 11:26-43

1 రాజులు 11:26-43 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నెబాతు కుమారుడైన యరొబాము కూడా రాజుపై తిరుగుబాటు చేశాడు. అతడు సొలొమోను సేవకులలో ఒకడు, జెరేదా వాడైన ఎఫ్రాయిమీయుడు. అతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. యరొబాము రాజు మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఇది: సొలొమోను మేడలను కట్టించాడు, తన తండ్రి దావీదు పట్టణ ప్రాకారంలో ఉన్న బీటలను బాగుచేయించాడు. యరొబాము సమర్థుడు, ఆ యువకుడు మంచిగా పని చేయడాన్ని సొలొమోను చూసి, యోసేపు గోత్రానికి చెందిన ప్రదేశంలో వెట్టి పని చేసేవారిమీద అతన్ని అధికారిగా నియమించాడు. ఆ సమయంలో యరొబాము యెరూషలేము విడిచి వెళ్తుండగా, త్రోవలో షిలోహు వాడైన అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రం ధరించుకొని అతన్ని కలిశాడు. వారిద్దరు తప్ప ఆ పొలంలో ఇంకెవరు లేరు. అప్పుడు అహీయా తాను వేసుకున్న ఆ క్రొత్త వస్త్రాన్ని తీసి పన్నెండు ముక్కలుగా చింపాడు. అప్పుడు అతడు యరొబాముతో, “నీవు పది ముక్కలు తీసుకో, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘సొలొమోను చేతిలో నుండి నేను రాజ్యం చీల్చి పది గోత్రాలు నీకు ఇవ్వబోతున్నాను. కాని నా సేవకుడైన దావీదును బట్టి, నా కోసం ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని బట్టి అతడు ఒక గోత్రం కలిగి ఉంటాడు. నేనిలా చేయడానికి కారణం వారు సొలొమోను తండ్రియైన దావీదులా నా మార్గాలను అనుసరించక నన్ను విడిచిపెట్టి సీదోనీయుల అష్తారోతు దేవతను, మోయాబీయుల కెమోషు దేవున్ని, అమ్మోనీయుల మిల్కోము దేవున్ని పూజిస్తూ, నా దృష్టికి సరియైనది చేయలేదు, నా శాసనాలను నియమాలను పాటించలేదు. “ ‘అయితే నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్నంతా తీసివేయను; నా కోసం ఎన్నుకున్న నా సేవకుడు, నా ఆజ్ఞలకు, శాసనాలకు లోబడిన దావీదును బట్టి, సొలొమోనును తన జీవితకాలమంతా పాలకునిగా నియమించాను. అతని కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి పది గోత్రాలను నీకు ఇస్తాను. నా పేరు అక్కడ ఉండాలని నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణంలో నా సేవకుడైన దావీదు కోసం నా సన్నిధిలో ఒక దీపం ఎల్లప్పుడు ఉండడం కోసం నేను అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇస్తాను. నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నీవు కోరుకున్న ప్రకారం నీవు పరిపాలిస్తావు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు. నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను. వారు చేసిన దానికి నేను దావీదు సంతానాన్ని శిక్షిస్తాను కాని ఎప్పటికి కాదు.’ ” సొలొమోను యరొబామును చంపే ప్రయత్నం చేశాడు కాని, యరొబాము ఈజిప్టుకు షీషకు రాజు దగ్గరకు పారిపోయి సొలొమోను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన వాటన్నిటి గురించి, అతని జ్ఞానం గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో వ్రాయబడినవి. సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలంతటిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.

1 రాజులు 11:26-43 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయీము గోత్రికుడు నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేవడానికి కారణం ఇది. సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి దావీదు పుర ప్రాకారానికి వచ్చిన బీటలు బాగు చేయించాడు. యరొబాము మహా బలశాలి. యువకుడైన ఇతడు పనిలో శ్రద్ధ గలవాడని సొలొమోను గ్రహించి, యోసేపు వంశం వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు. ఆ సమయంలో యరొబాము యెరూషలేములోనుండి బయటికి వెళ్ళగా షిలోనీయుడూ ప్రవక్త అయిన అహీయా అతన్ని దారిలో కలుసుకున్నాడు. అహీయా కొత్తబట్టలు కట్టుకుని ఉన్నాడు. వారిద్దరు తప్ప పొలంలో ఇంకా ఎవరూ లేరు. అప్పుడు అహీయా తాను వేసుకున్న కొత్త బట్ట చించి పన్నెండు ముక్కలు చేసి, యరొబాముతో ఇలా అన్నాడు. “ఈ పది ముక్కలు నీవు తీసుకో. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే ప్రజలు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అనే సీదోనీయుల దేవతకు, కెమోషు అనే మోయాబీయుల దేవుడికి, మిల్కోము అనే అమ్మోనీయుల దేవుడికి మొక్కుతున్నారు. సొలొమోను తండ్రి దావీదు లాగా వాళ్ళు నా విధానాలను అనుసరించి నడవలేదు. నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు. నా శాసనాలను ఆచరణలో పెట్టలేదు. కాబట్టి సొలొమోను చేతిలోనుండి రాజ్యాన్ని తీసేసి పది గోత్రాలను నీకిస్తాను. అయితే నా సేవకుడైన దావీదు కోసం, నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను. రాజ్యాన్ని సొలోమోను చేతిలోనుండి బొత్తిగా తీసివేయను. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించాడు కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకుని తన జీవితకాలమంతా అతన్ని పరిపాలన చేయనిస్తాను. అయితే అతని కొడుకు చేతిలోనుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు పది గోత్రాలు ఇస్తాను. నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదు కోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. అందువల్ల అతని కొడుక్కి ఒక గోత్రం ఇస్తాను. నేను నిన్ను ఎన్నుకుంటాను. నీవు కోరే దానంతటిమీదా పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు. నా సేవకుడైన దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను పాటించినట్లు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని, నా మార్గాలను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను కూడా స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు ఇస్తాను. నేను దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం మూలంగా శిక్షిస్తాను గానీ ఎల్లకాలం అలా చేయను.” సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయి, ఐగుప్తు రాజు షీషకు దగ్గర చేరి సొలొమోను చనిపోయే వరకూ ఐగుప్తులోనే ఉన్నాడు. సొలొమోను గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా అతని జ్ఞానం గురించి, సొలొమోను చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరినీ పాలించిన కాలం 40 ఏళ్ళు. సొలొమోను చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని తండ్రి దావీదు పురంలో అతన్ని పాతిపెట్టారు. తరువాత అతని కొడుకు రెహబాము అతనికి బదులు రాజయ్యాడు.

1 రాజులు 11:26-43 పవిత్ర బైబిల్ (TERV)

నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు. యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు. యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు. ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు. అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు. అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను. కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను. సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్తారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు. కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు. ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను. సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను. కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు. నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను. ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.’” సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు. తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు. తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.

1 రాజులు 11:26-43 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను. అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తున కలుగా చింపి యరొబాముతో ఇట్లనెను–ఈ పది తునకలను నీవు తీసికొనుము; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను; నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదు సంతతివారిని బాధ పరచుదునుగాని నిత్యము బాధింపను. జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెను. సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమునుగూర్చియు, సొలొమోను కార్యములనుగూర్చిన గ్రంథమందు వ్రాయబడి యున్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు. అంతట సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.