రోమా పత్రిక 9:1-13
రోమా పత్రిక 9:1-13 IRVTEL
నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది. సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి. పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్. అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.” అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు. ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.” అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు, దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం, పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే, “పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు” అని ఆమెతో చెప్పాడు. దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది.

