రోమా 9:1-13 - Compare All Versions
రోమా 9:1-13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్. దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.” మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు” అని వాగ్దానం ఇవ్వబడింది. అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో, కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా, పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని ఆమెతో చెప్పబడింది. “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది.
రోమా 9:1-13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది. సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి. పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్. అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.” అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు. ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.” అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు, దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం, పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే, “పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు” అని ఆమెతో చెప్పాడు. దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది.
రోమా 9:1-13 TERV (పవిత్ర బైబిల్)
క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్! ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.” ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.” అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవానికి సేవ చేస్తాడు” అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”
రోమా 9:1-13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును, అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు. వాగ్దానరూపమైన వాక్యమిదే– మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగాఉండు నిమిత్తము, పిల్ల లింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.