మార్కు 1:14-28

మార్కు 1:14-28 IRVTEL

యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు. ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు. తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.

సంబంధిత వీడియోలు

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు 1:14-28 కు సంబంధించిన వాక్య ధ్యానములు