మార్కు 1:14-28

మార్కు 1:14-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, యేసు దేవుని సువార్తను ప్రకటిస్తూ, గలిలయకు వెళ్లారు. ఆయన, “కాలము పూర్తయింది. దేవుని రాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి!” అని చెప్పారు. యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, సీమోను అతని సోదరుడు అంద్రెయ సముద్రంలో వల వేయడం ఆయన చూశారు, వారు జాలరులు. యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్లినప్పుడు, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను పడవలో ఉండి, తమ వలలను సిద్ధం చేసుకోవడం ఆయన చూశారు వెంటనే ఆయన వారిని పిలిచారు, వారు ఆలస్యం చేయకుండ తమ తండ్రియైన జెబెదయిని పనివారితో పాటు పడవలో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వారు కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు. అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేశాడు. అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది. ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది.

మార్కు 1:14-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు. ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు. తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.

మార్కు 1:14-28 పవిత్ర బైబిల్ (TERV)

యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు. యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు. అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు. యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు. ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది. ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది.

మార్కు 1:14-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యోహాను చెరపట్టబడిన తరువాత యేసు –కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపెట్టిన మనుష్యుడొకడుండెను. వాడు–నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. అందరును విస్మయమొంది – ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.