ఆది 13:5-13

ఆది 13:5-13 IRVTEL

అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు. లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది. కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు. అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.

ఆది 13:5-13 కోసం వీడియో