ఆదికాండము 13:5-13

ఆదికాండము 13:5-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి. వీరిద్దరి ఆస్తులు ఎంతో అధికంగా ఉండడం వల్ల వీరు కలిసి ఉండడానికి ఆ స్థలం సహకరించలేదు. అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు. కాబట్టి అబ్రాము లోతుతో, “మనం సమీప బంధువులం కాబట్టి నీ కాపరులకు నా కాపరులకు మధ్య వైరం కలిగి ఉండడం మంచిది కాదు. ఈ దేశమంతా నీ ముందు లేదా? మనం విడిపోదాము. నీవు ఈ భూభాగంలో ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను; నీవు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను” అని అన్నాడు. లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.) కాబట్టి లోతు యొర్దాను మైదాన ప్రాంతమంతా తన కోసం ఎంచుకుని తూర్పు వైపు వెళ్లిపోయాడు. వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు: అబ్రాము కనాను దేశంలో నివసించాడు, లోతు మైదాన పట్టణాల మధ్య నివసిస్తూ, సొదొమ దగ్గర గుడారాలు వేసుకున్నాడు. అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు.

ఆదికాండము 13:5-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు. లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది. కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు. అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.

ఆదికాండము 13:5-13 పవిత్ర బైబిల్ (TERV)

ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఆ భూమి సరిపోలేదు. అబ్రాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు. కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం. మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నీవు ఎడమకు వెళ్తే, నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.” లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్లు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొఱ్ఱాలను యెహోవా నాశనము చేయకముందు. ఆ కాలంలో సోయరు వరకు యొర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.) అందుచేత యొర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు. అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు. సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

ఆదికాండము 13:5-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అబ్రాముతోకూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము –మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లువారు ఒకరి కొకరు వేరై పోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను. సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి.