నిర్గమ 4:1-9

నిర్గమ 4:1-9 IRVTEL

అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు. యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు. అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు. తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది. తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది. అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.

నిర్గమ 4:1-9 కోసం వీడియో